లక్ష వినాయక ప్రతిమలను పంచిన చెవిరెడ్డి
Published by:Admin, Date:21-08-2020:07:05

చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం ఎదుట మట్టి వినాయక  విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చెవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ముందుగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని, విఘ్నాలను తొలగించాలని కోరారు. వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, ఈ పండుగను హిందువులు తొలి పండుగ గా భావిస్తారన్నారు. ఏటా వినాయక చవితి ఉత్సవాలను చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు కరోనా పరిస్థితుల నేపధ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మండలంలో రెండు, మూడు పాయింట్లు ఏర్పాటు చేసి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ఈ సారి మండలానికి పది నుంచి పదిహేను పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇలా నియోజకవర్గంలో 43 పాయింట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో పాయింట్ లో రెండున్నర వేలు విగ్రహాలు అందుబాటులో ఉంచామన్నారు. గత పదిరోజులుగా 340 మంది కార్మికులు నిరంతరంగా శ్రమించడంతో లక్ష విగ్రహాల తయారీ పూర్తయి పంపిణీకి సిద్ధమయ్యాయని వివరించారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఏటా నియోజకవర్గంలోని ప్రజలకు  ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మరుగున పడిపోతున్న మట్టి విగ్రహాల తయారీ జాతిని వెలుగులోకి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ విగ్రహాలను అందజేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ తో పాటు మట్టితో తయారైన విగ్రహాలను పూజించడం శ్రేష్ఠమనే సంతృప్తి ప్రజలకు మిగులుతుందన్నారు. ఈ కరోనా సమయంలో వినాయక ప్రతిమలను బయటకు వెళ్లి తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. 

పూజ చేయటం ఎలా..!

వినాయక చవితి పూజ చేయడం ఎలా..! అనే అంశంపై ప్రజలకు  అవగాహన కోసం నాలుగు పేజీల కరపత్రాన్ని అందించనున్నట్లు చెవిరెడ్డి తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వినాయకుని పూజా విశేషాలతో పాటు ఆచరించవలసిన నియమనింధనలు అందులో ఉంటాయని సూచించారు. ఏటా చంద్రగిరి నియోజకర్గంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందించే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేపడుతున్నదేనని స్పష్టం చేశారు.

తుమ్మల గుంటలో..

రెండున్నర అడుగుల పసుపు విగ్రహం 

రాష్ట్రంలో వినాయకుని అతిపెద్ద విగ్రహాల ఏర్పాటు లో తుమ్మల గుంట పోటీ పడేదన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అతి పెద్ద వినాయక విగ్రహం పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంప్రదాయ పద్దతుల్లో పసుపుతో తయారు చేసిన రెండున్నర అడుగుల వినాయక ప్రతిమను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెవిరెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో తిరుచానూరు పంచాయతీ ఈవో జనార్దన్ రెడ్డి పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: