క‌రోనా బాధితుల‌కు టిటిడి ఇతోధిక సాయం
Published by:Admin, Date:10-09-2020:08:34

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మార్చి నెల‌లో లాక్‌డౌన్ అమ‌లు చేసిన‌ప్ప‌టి నుండి క‌రోనా బాధితుల కోసం టిటిడి కోట్లాది రూపాయల వ్య‌యంతో ఇతోధికంగా స‌హాయ‌క చ‌ర్యలు చేప‌డుతోంద‌ని ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇటీవ‌ల చేప‌డు‌తున్న ప‌లు కార్య‌క్ర‌మాల ద్వారా ఎస్వీబీసీ విస్తృతంగా స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై గురువారం సాయంత్రం గీతా పారాయ‌ణం ప్రారంభ‌మైంది. 

 

            ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఈవో మాట్లాడుతూ చిత్తూరు, ఇత‌ర జిల్లాల నుండి వ‌స్తున్న‌ క‌రోనా బాధితుల‌కు బ‌స‌, ఆహారం త‌దిత‌ర సౌక‌ర్యాలను క‌ల్పించామ‌ని, టిటిడి వ‌స‌తి స‌ముదాయాల్లోని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో వేలాది మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నార‌ని వివ‌రించారు. లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టినుండి శ్రీ‌వారి కృపాక‌టాక్షాల కోసం శ్రీ‌నివాస మ‌హాశాంతి యాగం, శ్రీ ధ‌న్వంత‌రి మ‌హాయాగం, యోగ‌వాశిస్ట పారాయ‌ణం నిర్వ‌హించామ‌న్నారు. ఆ త‌రువాత నిర్వ‌హించిన సుంద‌ర‌కాండ పారాయ‌ణం, విరాట‌ప‌ర్వ పారాయ‌ణాన్ని ఎస్వీబీసీ ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నార‌ని తెలిపారు. టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ఎస్వీ వేద వ‌ర్శిటీ, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం, ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ‌, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌కు చెందిన పండితులంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసి ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌ని అభినందించారు. ఎస్వీబీసీని ఇటీవ‌ల యాడ్‌ఫ్రీ ఛాన‌ల్‌గా మార్చామ‌ని, ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రెండు నెల‌ల్లోనే దాదాపు రూ.4 కోట్ల విరాళాలు అందాయ‌ని వివ‌రించారు. భ‌గ‌వ‌ద్గీతను ప్ర‌చారం చేయాల‌ని భ‌క్తుల నుండి సూచ‌న‌లు అందుతున్నాయ‌ని, ఈ క్ర‌మంలో ఎస్వీబీసీ ద్వారా సామాన్య భ‌క్తుల‌కు అర్థ‌మ‌య్యేలా శ్లోకాల‌ను ప‌ఠించి వాటికి వ్యాఖ్యానం చెప్ప‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం త‌ప్ప‌క విజ‌య‌వంతం అవుతుంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను తెలుగుతోపాటు ఇత‌ర భాషల్లోని భ‌క్తుల‌కు కూడా అందించాల‌ని, భ‌క్తులంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

 

            టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ గీతాసారాన్ని భ‌క్తులంద‌రికీ అందించాలన్న ఆశయంతో ఈ రోజు నుండి గీతా పారాయణం ప్రారంభించామ‌న్నారు. భ‌గ‌వ‌ద్గీత‌లోని మొత్తం 18 ప‌ర్వాల్లో గ‌ల 700 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌డం జ‌రుగుతుందన్నారు. ప్ర‌తిరోజూ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం అవుతుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయ‌ని, ఇదే తరహాలో గీతా పారాయణం విశేషంగా ఆకట్టుకుంటుంద‌ని వివ‌రించారు. శ్లోక పఠనం, వ్యాఖ్యానంతో పాటు స‌మ‌కాలీన స‌మాజంలో మ‌నిషి ఎదుర్కొంటున్న పలు సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తూ గీతా పారాయణం ఉంటుంద‌న్నారు.

 

            ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఉపకుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ భ‌గ‌వ‌ద్గీత మాన‌వాళి మ‌నుగ‌డ ఆద‌ర్శ‌ప్రాయంగా తీర్చిదిద్దే మ‌హోన్న‌త గ్రంథమ‌న్నారు. ఉప‌నిష‌త్తుల సారాన్ని సాక్షాత్తు భ‌గ‌వంతుడు లోకానికి అందించార‌ని తెలిపారు. 

 

            అనంత‌రం వేదపండితుడు శ్రీ కుప్పా విశ్వనాథశాస్త్రి వ్యాఖ్యానం చెప్ప‌గా, వేదపారాయణందార్ శ్రీ కాశీపతి భగవద్గీత పారాయణం చేశారు. మొద‌టి రోజు ప‌లు శ్లోకాల‌ను పారాయ‌ణం చేసి వాటికి వ్యాఖ్యానం చెప్పారు. ముందుగా టిటిడి ఆస్థాన గాయ‌కులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాప‌కురాలు డా. వంద‌న శ్రీ‌కృష్ణుడిపై ప‌లు సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

 

             ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, పండితులు శ్రీ విభీష‌ణ‌శ‌ర్మ‌, శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ మారుతి, సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.

 fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: